6Tv Telugu News Channel
Today's Quote భవిష్యత్తుని అంచనా వెయ్యడానికి మంచి మార్గం దాన్ని సృష్టించడానికి ఉంది
6Tv Telugu News Channel
Flash news  1111111111111111111111 |  కేసీఆర్‌తో టీడీపీ ఎమ్మెల్యే మాగంటి భేటీ |  ‘ఈ-మెయిల్‌’ సృష్టికర్త టామ్లినసన్ మృతి |  800 ఏళ్ల తర్వాత బౌరాపూర్‌లో మల్లికార్జున కల్యాణం |  గుంటూరు-పొన్నూరు మార్గంలో ఆర్టీసీ బస్సుల నిలిపివేత | 
Home > Breaking News

లోక్‌సభ మాజీ స్పీకర్‌ పి.ఎ. సంగ్మా కన్నుమూత1 Y 84 days ago

లోక్‌సభ మాజీ స్పీకర్‌ పి.ఎ.సంగ్మా(68) ఈరోజు కన్నుమూశారు. 1996 నుంచి 1998 వరకు 11వ లోక్‌సభకు ఆయన సభాపతిగా బాధ్యతలు నిర్వర్తించారు.. 1988-1990 మధ్య మేఘాలయ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన ఎనిమిదిసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన మేఘాలయలోని తురా లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఇంజినీరింగ్‌ విద్యార్థిని మృతదేహానికి రీ పోస్టుమార్టం1 Y 84 days ago

మూడు వారాల క్రితం విశాఖలో ఆత్మహత్య చేసుకున్న ఇంజినీరింగ్‌ విద్యార్థిని శ్రిమ మృతదేహానికి ఈరోజు రీ పోస్టుమార్టం నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన శ్రియ విశాఖలోని గీతం యూనివర్శిటీలో ఇంజినీరింగ్‌ చదువుతోంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 12న వర్శిటీ ప్రాంగణంలోనే ఆత్మహత్యకు పాల్పడింది. అయితే తమ కుమార్తెది ఆత్మహత్య కాదని... హత్యేనని శ్రియ తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం శ్రియ మృతదేహానికి మరోసారి పోస్టుమార్టం చేయాలని ఆదేశించింది. దీంతో ఏసీపీ రఫీఖ్‌, మల్కాజ్‌గిరి తహసీల్దార్‌ విజయ ఆధ్వర్యంలో శ్రియ మృతదేహానికి ఈరోజు రీపోస్టుమార్టం నిర్వహించారు.

భారత బిలియనీర్ల చూపు.. ముంబయి వైపు! 1 Y 84 days ago

భారతదేశంలో ఉన్న అత్యంత సంపన్నుల్లో అధికులు ముంబయిలో నివాసం ఉండేందుకే మొగ్గు చూపుతున్నారు. వెల్త్‌ ఇంటిలిజెన్స్‌ సంస్థ అయిన నైట్‌ ఫ్రాంక్‌ విడుదల చేసిన ఆర్థిక నివేదిక -2016 ఈ విషయాల్ని వెల్లడించింది. ఈ నివేదిక ఆధారంగా ప్రపంచంలో అత్యంత సంపన్నులు ఉన్న నగరాలుగా తొలి ఐదు స్థానాల్లో వరసగా లండన్‌, న్యూయార్క్‌, సింగపూర్‌, హాంగ్‌కాంగ్‌, షాంఘైలు నిలిచాయి. ఆరోస్థానంలో దుబాయ్‌ నిలిచింది. ఆ నివేదికలో ఉన్న ఆసక్తికర అంశాలు ఇలా ఉన్నాయి.

* అత్యంత సంపన్నులు ముంబయిలో ప్రస్తుతం 1,094మంది ఉన్నారు. దిల్లీలో 545 మంది ఉన్నారు.
* వచ్చే దశాబ్దంలో ఈ సంఖ్య ముంబయిలో 2,243, దిల్లీలో 1,128గా ఉండనుంది.
* ఒక్కొక్కరూ నివశిస్తున్న ఇంటితో సహా లెక్కవేస్తే వారి నికర ఆస్తులు దాదాపుగా రూ.204 కోట్లుగా ఉన్నాయి.
* గత పదేళ్లలో భారత్‌లో బిలియనీర్ల సంఖ్య 333శాతం పెరిగింది.
* ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఆ పెరుగుదల 68శాతంగా మాత్రమే ఉంది.
* 2025 నాటికి ప్రపంచ బిలియనీర్ల సంఖ్యలో భారత్‌ వాటా ఆరు శాతంగా ఉండనుంది.

సాగర్ లోకి దూకిన ప్రేమజంట: ప్రియుడి మృతి1 Y 86 days ago

సమస్యలు పరిష్కరించుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతోన్న హైదరాబాద్ నగర వాసులకు హుస్సేన్ సాగర్ అడ్డాగామారిన నేపథ్యంలో లేక్ పోలీస్ వ్యవస్థను ఏర్పాటుచేసి ఆత్మహత్యలతోపాటు అసాంఘిక శక్తులకూ అడ్డుకట్టవేసే ప్రయత్నం జరిగింది. అయినాకూడా అక్కడ ఆత్మహత్యోదంతాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఈ రోజు(బుధవారం) ఉదయం కూడా ట్యాంక్ బండ్ పై నుంచి హుస్సేన్ సాగర్ లోకి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిందో ప్రేమజంట. రామ్ గోపాల్ పేట పోలీసులు తెలిపిన వివరాలను బట్టి నగరానికే చెందిన నరేశ్(29) అనే వ్యక్తి తన ప్రేయసితో కలిసి బుధవారం ఉదయం హుస్సేన్ సాగర్ లోకి దూకాడు. ఇది గమనించిన లేక్ పోలీసులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే నరేశ్ ప్రాణాలు కోల్పోయాడు.

గప్‌చుప్‌గా పెళ్లి తంతు కానిచ్చేసిన ప్రీతీ జింతా1 Y 86 days ago

బాలీవుడ్ భామ ప్రీతీ జింతా పెళ్లి బాజాలు మెల్లమెల్లగా అంతటా వినిపిస్తున్నాయి. అమెరికకు చెందిన జీన్ గుడ్ ఎనఫ్ అనే వ్యక్తిని ఈ సొట్ట బుగ్గల సుందరి పరిణయమాడింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక జరిగింది. అయితే కబీర్ బేడి, సుష్మిత సేన్, ఫరా ఖాన్ తదితర బాలీవుడ్ ప్రముఖుల ట్వీట్లు ప్రీతీ పెళ్లి విషయాన్ని బయటపెట్టేశాయి.

సస్పెన్షన్‌ వ్యాజ్యం వాయిదాపై డివిజన్‌ బెంచ్‌కు రోజా1 Y 86 days ago

తన సస్పెన్షన్‌ను సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ఈ నెల 9కి వాయిదా వేయడాన్ని ప్రశ్నిస్తూ వైసీపీ ఎమ్మెల్యే రోజా డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించారు. పిటిషనర్‌ తరపున సుప్రీంకోర్టు నుంచి వచ్చిన సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ మంగళవారం వాదనలు విన్పించారు. రోజా సస్పెన్షన్‌పై దాఖలైన వ్యాజ్యంలో శాసన వ్యవహారాల శాఖ, అసెంబ్లీ కార్యదర్శులు కౌంటర్లు దాఖలు చేయకుండా వాయిదా కోరారని, ఈ నెల 5 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున 9వ తేదీకి వాయిదా వేయడం వల్ల పిటిషనర్‌ సమావేశాల్లో పాల్గొనే అవకాశం కోల్పోతారని తెలిపారు. కౌంటర్‌ దాఖలు చేయాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఏదో ఒక మిషతో వాయిదా కోరుతున్నారని తెలిపారు. నిబంధనల ప్రకారం సభ నుంచి సస్పెండ్‌ చేసే అధికారం ఒక సెషన్‌కు మాత్రమే పరిమితం చేయాలన్నారు. దీనిపై అదనపు ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌ మాట్లాడుతూ గత నెల 17న ఇచ్చిన నోటీసులు అసెంబ్లీ కార్యదర్శికి 24న అందాయని, వాదనలు చెప్పాలని తనను కోరారని, ఆ విషయాన్నే కోర్టుకు చెప్పి వాయిదా కోరానని తెలిపారు.ఆర్టికల్‌ 194(3) ప్రకారం సభా మర్యాదలు పాటించని సభ్యులను స్పీకర్‌ సస్పెండ్‌ చేయవచ్చని చెప్పారు.

జగన్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన సొంతపార్టీ ఎమ్మెల్యే !1 Y 86 days ago

ఏపీలో తెలుగుదేశం అన్న మాట వినిపిస్తే చాలు వైకాపా నేతలు తుళ్లిపడుతున్నారు. సంస్థాగతంగా టీడీపీని పటిష్టం చేయడం కోసం చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ పథకం జగన్‌ పార్టీ నేతలకు నిద్రలేకుండా చేస్తోంది. ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు. విజయవాడ బందరురోడ్డులోని మాజీమంత్రి, పశ్చిమ కృష్ణా వైసీపీ అధ్యక్షులు పార్ధసారథి నివాసంలో వైసీపీ అగ్రనేతలంతా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో విజయసాయిరెడ్డి, జ్యోతుల నెహ్రూ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని తదితరులు పాల్గొని కోస్తాలో వలసలను నివారించే చర్యలపై కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. రాయలసీమలోని కర్నూలు జిల్లానుంచి వైసీపీ నేత భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిలప్రియ, కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత కోస్తా నుంచి కూడా వలసలు ఉంటాయని వైసీపీ నేతలకు సమాచారం అందింది. వెనువెంటనే వారు అప్రమత్తమై విజయవాడలో ఈ మీటింగ్‌ ఏర్పాటుచేశారు. పార్టీ ఎమ్మెల్యేలను బుజ్జగించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా జంప్‌ జిలానీలుగా మారుతారని అనుమానం ఉన్న ఎమ్మెల్యేల వద్దకు అగ్రనేతలను రాయబారానికి పంపాలనీ, అవసరమైన బుజ్జగింపు చర్యలు చేపట్టాలనీ నిర్ణయించారు.

అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని మృతి1 Y 86 days ago

గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని రాణిమిశ్రా అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. లేడీస్‌ హాస్టల్‌ సమీపంలో మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు రంగప్రవేశం చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

కవలలుగా ఆడపిల్లలు పుట్టారంటూ.. ఓ శిశువు గొంతు కోసిన కసాయి తండ్రి1 Y 86 days ago

నెల్లికుదురు మండలం మద్దుతండాలో దారుణం జరిగింది. కవలలుగా ఆడపిల్లలే పుట్టారంటూ తండ్రి ఓ శిశువు గొంతుకోసి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది

లైసెన్సు తీసుకుంటే చాలు గన్ ఇచ్చేస్తాడట1 Y 86 days ago

భద్రం .... బీ కేర్‌ఫుల్... అంటున్నాడు ఆ యజమాని. ఆయనకు గ్రిఫిన్, సెయింట్ సైమన్స్ ఐలండ్, అట్లాంటాల్లో చాలా కార్యాలయాలు ఉన్నాయి. వాటిలో పనిచేసేవారు సురక్షితంగా ఉండాలన్నదే ఆయన కోరిక. అందుకే ప్రతి ఒక్కరూ గన్ లైసెన్స్ తీసుకోండి, గన్ నేను ఇస్తానంటున్నాడు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ అనుకోకుండా జరిగే హాని నుంచి తప్పించుకోవాలని సూచిస్తున్నాడు. మెట్రో అట్లాంటా ఏరియాలో ఈ మధ్య ఇళ్ళ దోపిడీలు, ఘోరమైన నేరాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తన కార్యాలయాల్లో పని చేసే సిబ్బంది భద్రత కోసం ఏదైనా చేయాలని లాన్స్ టోలండ్‌ బాగా ఆలోచించారు. లాన్స్ టోలండ్ ఈ ప్రకటన చేసిన మూడు, నాలుగు వారాల్లోనే సిబ్బంది లైసెన్సులు సంపాదించారు. 

12 ఏళ్ల అమ్మాయితో 65 ఏళ్ల వ్యక్తి పెళ్లి...1 Y 86 days ago

 65 ఏళ్ల వ్యక్తి 12 ఏళ్ల బాలికను వివాహం చేసుకున్నాడు. స్థానికులకు కోపం వచ్చి నాలుగు తగిలించగానే అసలు విషయం చెప్పాడు. బాల్య వివాహాలపై అవగాహన కోసం తాము ఫోటోలకు ఫోజులిచ్చామని నిజంగా పెళ్లి చేసుకోలేదని వాస్తవం వెల్లడించాడు. ఈ సంఘటన అమెరికాలో జరిగింది. న్యూయార్క్‌ టైమ్‌ స్క్వేర్ వద్ద చిన్నారి పెళ్లికూతురితో ప్రత్యక్షమై ఫోటోలు తీసుకుంటున్న 65 ఏళ్ల వ్యక్తి అందరికీ కోపం తెప్పించాడు. కొందరు మహిళలైతే ఆ బాలిక దుస్థితి చూసి కంటతడి పెట్టుకున్నారు. కొందరు కొట్టబోయే సరికి ఆ వృద్ధుడు అసలు విషయం చెప్పాడు. అమెరికాలో బాల్య వివాహాల పట్ల ప్రజల్లో అవగాహన కోసం ఒక ఫోటో షూట్‌ నిర్వహిస్తుండగా ప్రజలు తనను పట్టుకుని కొట్టబోయారని ఆ వృద్ధుడు వెల్లడించాడు.

మగాడు ఏకాకిగా మరణిస్తే మహిళ శవంతో అంత్యక్రియలు1 Y 86 days ago

చైనాలో పురుషులు ఒంటరిగా చనిపోకూడదట! ఏకాకిగా ఉండే మగాడు మరణిస్తే వంశవృక్షం అసంపూర్ణంగా మిగిలిపోతుందని చైనీయులు విశ్వసిస్తున్నారు. ఒకవేళ తోడు లేని పురుషుడు మృతి చెందితే కృత్రిమ భార్యను ఇస్తారు. వెండితోగానీ, పిండితోగానీ మహిళ బొమ్మను తయారు చేస్తారు. బ్లాక్ బీన్స్‌తో ఆ బొమ్మకు కళ్లను ఏర్పాటు చేస్తారు. కొందరైతే నిజమైన మహిళ శవాన్ని తీసుకొస్తారు. ఈ బొమ్మనుగానీ, మహిళ శవాన్నిగానీ మృతుడి శవం పక్కన పెట్టి అంత్యక్రియలు జరుపుతారు. నిజమైన మహిళ శవాన్ని పెట్టి అంత్యక్రియలు చేయకపోతే ఆ మరణించిన పురుషుడు తిరిగి వచ్చేస్తాడని, కుటుంబానికి అరిష్టమని చైనీయులు భావిస్తారు.ఇలా దెయ్యాల పెళ్ళిళ్ళు చేసే ఆచారం 17వ శతాబ్దం నాటిది. 50 సంవత్సరాల నుంచి కమ్యూనిస్టు పరిపాలకులు ఈ మూఢనమ్మకాన్ని పారదోలాలని కృషి చేస్తున్నప్పటికీ సత్ఫలితాలు రావడం లేదు. కొందరు స్వార్థపరులు ఈ ఆచారాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. మహిళల శవాలను దొంగతనంగా ఎత్తుకెళ్ళి అమ్మేస్తున్నారు.

ఠాణాల్లో చైల్డ్‌ వెల్ఫేర్‌ పోలీస్‌ ఆఫీసర్‌1 Y 86 days ago

 పోలీస్‌ స్టేషన్లలో చైల్డ్‌ వెల్ఫేర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా స్థాయిలో ఏఎస్పీ, పోలీస్‌ కమిషనరేట్‌ స్థాయిలో డీసీపీ, అడిషనల్‌ డీసీపీ నేతృత్వంలో స్పెషల్‌ జువైనల్‌ పోలీస్‌ యూనిట్‌ను ఏర్పాటు చేసి ప్రతి పోలీస్‌ స్టేషనలో స్టేషన హౌస్‌ అధికారిని చైల్డ్‌ వెల్ఫేర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నియమించాలని కోరుతూ డీజీపీ అనురాగ్‌ శర్మ ప్రభుత్వానికి నివేదిక పంపారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం1 Y 86 days ago

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. రెండు రాష్ట్రాల్లో సెట్‌-సి ప్రశ్నపత్రం ఎంపిక చేశారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్ష జరగనుంది. నిమిషం ఆలస్యం నిబంధనను అమలు చేయడంతో విద్యార్థులు అర్థగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.

చంద్రబాబుతో వైకాపా ఎమ్మెల్యే భేటీ1 Y 86 days ago

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుతో బుధవారం ఉదయం ఆయన నివాసంలో కర్నూలు జిల్లా కోడూరు వైకాపా ఎమ్మెల్యే మణిగాంధీ భేటీ అయ్యారు. మణిగాంధీ తెదేపాలో చేరనున్నట్లు తెలుస్తోంది. 

కేటీహెచ్‌ మాస్టర్స్‌ ఛాలెంజ్‌లో వీఐటీ విద్యార్థి ప్రతిభ1 Y 86 days ago

 స్వీడన్‌ దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ కేటీహెచ్‌ రాయల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నిర్వహించిన వైర్‌లెస్‌ సిస్టం ట్రాక్‌ పరీక్షలో వెల్లూరు వీఐటీ విద్యార్థి మహ్మద్‌ కమాల్‌ఖ్వాజా ప్రథమస్థానంలో నిలిచాడు. వీఐటీలో బీటెక్‌ (ఈఈఈ) చివరి సంవత్సరం చదువుతున్న ఈ విద్యార్థి గతేడాది డిసెంబరులో బెంగళూరులో కేటీహెచ్‌ నిర్వహించిన పోటీ పరీక్షల్లో నెగ్గాడు. ఆ విద్యా సంస్థ అందించే ఉపకార వేతనానికి ఎంపికవడంతో పాటు పరిశోధనతో కూడిన వైర్‌లెస్‌ సిస్టం కోర్సులో చేరేందుకు అర్హత సాధించాడు. ఎందరో మేథావులను రూపొందించిన ఘనత కేటీహెచ్‌ రాయల్‌ ఇనిస్టిట్యూట్‌కు ఉంది. పోటీ పరీక్షలో ఎంపికైన విద్యార్థి కమాల్‌ఖ్వాజాకు విశ్వవిద్యాలయ డీన్‌ ప్రొఫెసర్‌ అరుల్‌మొళివర్మన్‌ మార్గదర్శిగా నిలిచారు.

విరాట్‌ నిలవగా... యువీ దంచగా1 Y 86 days ago

ప్రత్యర్థే మారింది! ఫలితం మారలేదు.. తేదీనే మారింది.. ఆట మారలేదు! భారత్‌ది అదే దూకుడు! అగ్నికి వాయువు తోడైనట్లు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ విరాట్‌ కోహ్లి (56 నాటౌట్‌; 47 బంతుల్లో 7×4)కి యువరాజ్‌సింగ్‌ (35; 18 బంతుల్లో 3×4, 3×6) జత కలవడంతో ఆసియాకప్‌లో భారత్‌ హ్యాట్రిక్‌ విజయంతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలుత బంతితో ప్రత్యర్థికి కళ్లెం వేసి.. తర్వాత బ్యాట్‌తో అదరగొట్టి మరో విజయాన్ని అందుకుంది. ఇక గురువారం నామమాత్రమైన చివరి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా... యూఏఈతో తలపడనుంది.

తెలుగు టైటాన్స్‌ ఖేల్‌ ఖతం 1 Y 86 days ago

 ప్రొ కబడ్డీలో తెలుగు టైటాన్స్‌ కథ ముగిసింది. నిరుడు సెమీఫైనల్‌ చేరిన తెలుగు జట్టు.. ఈసారి లీగ్‌ దశతోనే పోరాటాన్ని ముగించింది. సెమీఫైనల్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌, ఆతిథ్య యు ముంబా 38-22తో విజయం సాధించి టైటాన్స్‌ ఆశలను ఆవిరి చేసింది. బంగాల్‌భారీ తేడాతో ఓడిపోయి.. తన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో యు ముంబాను ఓడించివుంటే టైటాన్స్‌ సెమీస్‌ రేసులో నిలిచేది. ఐతే మంగళవారం తెలుగు జట్టు మ్యాచ్‌ కంటే ముందే బంగాల్‌ వారియర్స్‌ 26-22తో బెంగళూరు బుల్స్‌ను ఓడించి మూడో సెమీస్‌ బెర్తు దక్కించుకుంది. టైటాన్స్‌ ఓడిపోవడంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలోని పుణెరి పల్టాన్‌కు నాలుగో బెర్తు ఖాయమైంది.

వర్మ మాటలకు షాక్ అయిన విజయవాడ విద్యార్ధులు!1 Y 88 days ago

వంగవీటి రంగా జీవిత నేపధ్యంతో సినిమా తీయబోతున్న సందర్భంగా రాజకీయ నాయకులతో చర్చించేందుకు ఈమధ్య విజయవాడ వెళ్లాడు రాంగోపాల్ వర్మ. ఆయనకు అక్కడ ఘన స్వాగతం కూడా లభించింది. రెండు మూడు రోజులుగా అక్కడా ఇక్కడా మాట్లాడుతూ ఏవో వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడు. లేటెస్ట్ గా వర్మ విజయవాడలో స్టూడెంట్స్ తో ఇష్టాగోష్టిగా మాట్లాడాడు. అక్కడ కూడా తన ధోరణిలో ఓ కామెంట్ చేశాడు. విద్యార్థులతో మాట్లాడిన రాంగోపాల్ వర్మ వాళ్లు అడిగిన ప్రశ్నలకు తన మార్క్ ఆన్సర్స్ ఇచ్చాడు. క్షణక్షణం సినిమాలో శ్రీదేవి డ్రెసెస్ కు మూడు లక్షలు ఖర్చు పెట్టారు కదా. అదే ఇప్పుడైతే ఎంత ఖర్చవుతుందని ఓ విద్యార్థిని అడిగింది. అందుకు వర్మ వెంటనే జవాబిస్తూ ...బట్టలకయ్యే ఖర్చు కన్నా కాస్ట్యూమ్స్ విప్పితే ఇంకా ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుందని చెప్పాడు. దాంతో అక్కడున్న వారంతా... ఇంత పేరున్న డైరెక్టర్ ఇలా మాట్లాడుతున్నా డేమిటి అని ఆశ్చర్యపోయారు.

సైన్స్‌ఫెయిర్ లో పేలుడు1 Y 88 days ago

: వైఎస్సార్ కడప జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.  సైన్స్‌ ఫెయిర్‌ను ఆసక్తిగా తిలకిస్తున్న విద్యార్థులు అక్కడ ఏర్పాటు చేసిన పెట్రోల్ పరికరాన్ని చూస్తున్న సమయంలో అది అకస్మాత్తుగా పేలింది. దీంతో 10 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని ప్రొద్దుటూరు ఆంధ్రకేసరిరోడ్డులో సోమవారం చోటు చేసుకుంది. స్థానిక శాంతినికేతన్ ఉన్నత పాఠశాలలో ఈ రోజు సైన్స్‌ఫెయిర్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అదే పాఠశాలకు చెందిన ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులు ప్రదర్శనను తిలకిస్తున్న సమయంలో పెట్రోల్‌తో తయారు చేసిన ఓ పరికరం పేలింది. దీంతో చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా.. చిన్నారులకు తీవ్రంగా గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. 


Copyrights © 2014 6tvlive.com